ఢిల్లీ ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన సెహ్వాగ్‌, యువరాజ్‌

 పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యతిరేక నిరసనల సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా..వందలాది మంది గాయపడ్డారు. 


'ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు విచారకరం. దయచేసి అందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్రిక్త పరిస్థితులను  అదుపులోకి తెచ్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. మనమంతా మనుషులమే.  మనమంతా ఇతరుల పట్ల ప్రేమ, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని' యువీ ట్వీట్‌ చేశాడు. 


'ఢిల్లీలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం. ఢిల్లీలో ప్రతిఒక్కరు  ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికైనా ఏదైనా గాయం లేదా ఆపద కలిగితే అది గొప్ప భారతదేశ రాజధానికే మాయని మచ్చ అవుతుంది.   శాంతి నెలకొనేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని'  సెహ్వాగ్‌  ట్విటర్లో కోరారు.